మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. వీరిలో ఇద్దరు నైజీరియన్లతో పాటు ఒక మహిళ ఉన్నారు. వీళ్లను ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చొనట్టు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్ గూడ జైలుకు తరలించారు. మహేష్ బ్యాంకు సర్వర్ ను గత నెల 20వ తేదీన హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. 12.9 కోట్లను పలు ఖాతాలకు బదిలీ చేశారు. ఆ ఖాతాలన్నీ కూడా ఢిల్లీ, కలకత్తా, మణిపూర్, అస్సాం, మేఘాలయ, బిహార్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీ వెళ్లి ఖాతాదారుల చిరునామా సేకరించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్ల ముగ్గురికి సైబర్ నేరగాళ్లకు ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైం పోలీసులు కలకత్తా కూడా వెళ్లారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఖాతాదారుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
సర్వర్ నిర్వహణ లోపాలే హ్యాంకింగ్ కు దారి తీశాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఆరు నెలల క్రితం అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయిన విధానం.. ప్రస్తుతం మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయిన విధానం ఒకే విధంగా ఉందని.. ఆ కేసులో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు బ్యాంకులకు కూడా ఒకే సంస్థ సర్వర్ల రక్షణకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు.
సర్వర్లు హ్యాక్ కాకుండా కావాల్సిన ఫైర్ వాల్స్, ఇతర రక్షణ చర్యలను సాఫ్ట్ వేర్ సంస్థ చూస్తోంది. అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయినప్పుడే.. సాఫ్ట్ వేర్ లో ఏమైనా లోపాలున్నాయా అని సదరు సంస్థకు చెందిన నిర్వాహకులు సమీక్షించుకుని ఉంటే.. మరోసారి హ్యాకింగ్ జరిగి ఉండేది కాదని సైబర్ క్రైం పోలీసులు అభిప్రాయపడుతున్నారు.