అమెరికాలో కాల్పులు పరిపాటిగా మారాయి. వరుసగా కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
లాస్ ఏంజిల్స్ కు సమీపంలోని బెవర్లీ క్రెస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనంలో కలిసిపోయిన దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. ఒక కాల్పుల ఘటన మరవకముందే మరోకటి చోటు చేసుకుంటుంది. కాలిఫోర్నియాలో నెల రోజుల్లో కాల్పులు జరగడం ఇది నాలుగోసారి.
జనవరి 4న అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది చనిపోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఉటా ప్రావిన్స్‌లో ఇనాక్ సిటీలోని ఓ ఇంట్లో రాత్రి సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఎనిమిది మంది మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. జనవరి 21న అర్థరాత్రి దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది మరణించారు.
జనవరి 23న సాయంత్రం సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణ ప్రాంతంలో ఓ పుట్ట గొడుగుల పెంపకం వద్ద, ట్రక్కింగ్ సంస్థ వద్ద కాల్పులు జరిగారు. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో కొందరికి గాయాలు అయ్యాయి. అలాగే అమెరికాలోని అయోవాలోని డెస్ మోయిన్స్ నగరంలో ఓ పాఠశాలలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డారు. గతంలో ఇంకా అనేక కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.