తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతుంటే.. కామారెడ్డి,జగిత్యాల వాసులు తెలంగాణ ఉద్యమం నాటి రోజులను మళ్లీ గుర్తు చేశారు. భోగి వేళ ముగ్గుల రూపంలో తమ నిరసనలు తెలిపారు. స్టాప్ మాస్టర్ ప్లాన్ అంటూ ముగ్గులు వేసి తమ ఆకాంక్షను చాటారు. ఇటీవల కొన్ని రోజులుగా కామారెడ్డి జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు హోరెత్తుతున్నాయి.
ఇందులో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. మా భూముల్లో ఇండస్ట్రియల్ జోన్లు చేసి ఎమ్మెల్యేలు మీరు మాత్రం పండగ చేసుకోండి.. అంటూ ముగ్గులతో రాశారు. జగిత్యాల మండలం మోతె,నర్సింగాపూర్ గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ రైతులు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. స్టాప్ రిక్రియేషన్ జోన్,సాప్ట్ మాస్టర్ ప్లాన్ అంటూ తమ ఇళ్ల ముందు ముగ్గుతో రాశారు.
మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఇప్పటి వరకు 49 మంది కౌన్సిలర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. అంతే కాకుండా మున్సిపల్ కార్యలయం, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు.
ఇక ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగ్గురు వ్యక్తులు నిరసనకు దిగారు. సంక్రాంతి రోజు కూడా ఇదే తరహాలో నిరసనలు చేపడతామని రైతు జేఏసీ గతంలోనే ప్రకటించింది.