అదుపుతప్పి కారు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ఓ కళాశాలలో చదువుకుంటున్న వారు.. స్నేహితుడి వివాహ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
కిరణ్మయి(19), శిరీష(21), అరవింద్ (23), రేణుక కలిసి గురువారం వెల్దండ వెళ్లారు. స్నేహితుడి వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి కారులో హైదరాబాద్ బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్తాల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో కిరణ్మయి, శిరీష, అరవింద్ అక్కడికక్కడే మృతి చెందారు. రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. రేణుకను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు నల్గొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం వారు ఓ కళాశాలలోని హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు.