శివసేన పార్టీ చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ స్తంభింపజేయడంతో మహారాష్ట్రలో సేన వర్సెస్ సేన వివాదంకొత్త మలుపు తిరుగుతోంది. తమ పార్టీ గుర్తుపై సెకండ్ థాట్ పెట్టిన మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం.. తమకు ‘త్రిశూలం’ లేదా ‘ఉదయించే సూర్యుడు’ చిహ్నం కావాలని ఈసీని కోరుతోంది. . తమదే అసలైన శివసేన అని చెప్పుకుంటున్న ఈ వర్గం పార్టీ పేరు, చిహ్నానికి సంబంధించి ఈసీకి కొత్తగా మూడు ఆప్షన్స్ సమర్పించింది.
ముంబైలోని అంధేరీ ఈస్ట్ కి జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ చిహ్నాలను పార్టీ ఎంచుకుంది. మొదటి ఛాయిస్ .. పార్టీ పేరు వ్యవస్థాపకుడైన శివసేన బాలాసాహెబ్ థాక్రే, కాగా రెండో ఛాయిస్ .. శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే అని ఈ వర్గం వివరించింది. తమదే అసలైన శివసేన అని ఇటు థాక్రే వర్గం, అటు సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం కూడా ఈసీ ముందు వాదించడంతో.. ఈసీ ఎటూ చెప్పకుండా ఓ నిర్ణయం తీసుకుంది.
రానున్న ఎన్నికల్లో వీటిలో ఏ వర్గమూ పార్టీ పేరును, పార్టీ గుర్తయిన విల్లంబులనూ వాడకుండా స్తంభింపజేసింది. మూడు పేర్లను, సింబల్ ఆప్షన్లనూ సూచించాలని కోరింది. మీకు వేర్వేరు చిహ్నాలను కేటాయిస్తామని, వీటిలో దేన్నయినా మీరు ఎంపిక చేసుకోవచ్చునని పేర్కొంది.
1989 లో శివసేన ఫిక్స్డ్ చిహ్నాన్ని(విల్లంబులు) పొందగా . అంతకు ముందు.. షీల్డ్, ఖడ్గం, కొబ్బరి చెట్టు, రైల్వే ఇంజన్ వంటి వివిధ గుర్తులపై ఎన్నికల్లో పోటీ చేసింది. తమకు విల్లంబులు చిహ్నాన్ని కేటాయించాలని షిండే వర్గం ఈ నెల 4 న ఈసీని కోరడంతో.. ఎన్నికల కమిషన్.. ఎటూ చెప్పకుండా మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకోవడం విశేషం.