ఎప్పటికప్పుడూ ప్రభత్వ వైఫల్యాలను తనదైన శైలీలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి సీఎం జగన్ పై మరో సారి విమర్శల బాణాలు వదిలారు. మాట తప్పడం- మడమ తిప్పడం సీఎం జగన్ దినచర్య అని వ్యాఖ్యానించారు. పదే.. పదే మాట తప్పే నాయకుడు ఒక నాయకుడేనా..? అని ప్రశ్నించారు.
నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీపీఎస్ రద్దు రద్దు చేస్తానని మాట దాటేశాని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, శాసన మండలి రద్దు విషయాలను పక్కతోవ పట్టించారని ఆరోపించారు.
రైతు భరోసా, చెల్లేమ్మల పెళ్లి కానుక, అగ్రిగోల్డ్ బాధితుల సంగతేంటని ప్రశ్నించారు తులసిరెడ్డి. పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించడంలో వైఫల్యం చెందారని కీలక వ్యాఖ్యలు చేశారు.
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుట్ర కారణం అని చెప్పిన జగన్.. సీఎం అయ్యాక అంబానీ సిఫారసు చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారని మండి పడ్డారు తులసిరెడ్డి. ఇలాంటి నాయకుడు ఏపీ రాష్ట్రానికి అవసరమా..? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు తులసిరెడ్డి.