బారెడు పెంపు, మూరెడు తగ్గింపు.. ఇదే మోడీ కనికట్టు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తోందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ఎక్సజ్ సుంకం లీటర్ పెట్రోల్ మీద రూ.9.8 పైసలు.. డీజిల్ మీద రూ.3.56 పైసలు మాత్రమే ఉండేదని తెలిపారు.
ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం.. పెట్రోల్ మీద రూ.33.00, డీజిల్ మీద రూ.31.83 పైసలు సుంకాన్ని పెంచిందని ఆరోపించారు. తర్వాత ప్రజల మెప్పు పొందేందుకు పెట్రోల్ మీద రూ.13 లు, డీజిల్ మీద రూ.16 లు తగ్గించారని విమర్శించారు. ఇప్పటికీ కాంగ్రెస్ పాలన కంటే మోడీ పాలనలో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ పై రూ.10.50 పైసలు, డీజిల్ పై రూ. 12.00 లు ఎక్కువుగా కొనసాగుతోందని విరుచుకుపడ్డారు.
జగన్ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని జలగలా తాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో పెట్రోల్ పై 31 శాతం, డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ ఉందని తెలిపారు తులసి రెడ్డి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ కింద రూ.4.. రోడ్డు సెస్ కింద రూ.1 ని రాష్ట్ర ప్రభుత్వం విధించిందని ఆరోపించారు.
పర్యావసానంగా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ, పుదుచ్చేరి ల కంటే అంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు తులసి రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్ పై రూ.9.48 పైసలకు, డీజిల్ పై రూ. 3.56 పైసలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పొరుగు రాష్ట్రాల స్థాయికి తగ్గించాలని, లేదంటే ప్రజలే బుద్ది చెప్తారని హెచ్చరించారు తులసి రెడ్డి.