మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కొత్తది కాదని పేర్కొన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. కాంగ్రెస్ పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పాత పథకాన్ని తామేదో కొత్తగా ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.5 లక్షలు వరకు ఈ పథకం వర్తించేదని తెలిపారు. దాదాపు అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేవని స్పష్టం చేశారు.
జగన్ పాలనలో ఒక్కొక్క సంఘానికి రూ.3 లక్షలు వరకు మాత్రమే పరిమితి విధించారని ఎద్దేవాచేశారు. దీని వలన 25 శాతం మాత్రమే సంఘాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ఈ పథకం గురించి ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదన్నారు.
జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం మరీ ఎక్కువైందని ఆరోపించారు. పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్లుంది జగన్ పాలన తీరు అని తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి.