వైసీపీ పోవాలి,బీజేపీ రావాలి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపునివ్వడ హాస్యాస్పదంగా ఉందన్నారు ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. నడ్డా మాటలు వింటుంటే గొర్రెల తినేవాడు పోయి.. బర్రెల తినేవాడు రావాలన్నట్టే ఉందని వ్యాఖ్యానించారు. దొంగ పోయి, గజదొంగ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని విమర్శలు చేశారు. రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ అయితే.. నెంబర్ టూ ద్రోహి వైసీపీ అని మండిపడ్డారు.
రాష్ట్రానికి బీజేపీ శనిగ్రహం అయితే.. వైసీపీ, టీడీపీలు రాహు కేతువులని విరుచుకుపడ్డారు తులసి రెడ్డి. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిoది బీజేపీ కాదా..? అని ప్రశ్నించారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీకి బురిడీ కొట్టింది బీజేపీ కాదా..? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసి.. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ను కనుమరుగు చేసింది కేంద్ర ప్రభుత్వం నిప్పులు చెరిగారు.
దుగ్గరాజపట్నం ఓడరేవుకు మంగళం పాడి.. పంగనామాలు పెట్టారని విరుచుకుపడ్డారు. అవినీతిలో బీజేపీ, వైసీపీలు దొందు దొందే నని కీలక వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాతో వైసీపీ ప్రభుత్వం అక్రమ దందాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో అవినీతికి అంతులేకుండా పోయిందని ఆరోపించారు.
దేశాన్ని బీజేపీ.. ఇటు రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు తులసి రెడ్డి. మూడు ఏళ్ల పాలనలో ఏపీలో జగన్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 8 ఏళ్లలో మోడీ ప్రభుత్వం రూ.85 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. కేంద్రంలో బీజేపీ పోవాలి.. రెండు చోట్ల కాంగ్రెస్ రావాలి.. అని పిలుపునిచ్చారు తులసి రెడ్డి.