ఏపీలో వైసీపీ నేతల ఆరాటాలు ఆర్భాటాలు ఎక్కువయ్యాయని విమర్శించారు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు.. మంత్రులు అట్టహాసాలు ప్రధర్శించుకుంటున్నారని ఆరోపించారు.
ఒంటిమిట్టలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా 3500 మంది పోలీసులతో బందోబస్తు అవసరమా..? అని నిలదీశారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషాశ్రీచరణ్ విజయోత్సవ ర్యాలీ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని.. ట్రాఫిక్ లో ఇరుక్కున్న పండు అనే 8 నెలల చిన్నారి సకాలంలో వైద్యం అందక చనిపోవడం విచారకరమని విమర్శించారు.
శ్రీకాళహస్తి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శనం కోసం 3 గంటల పాటు వేసవిలో భక్తులను క్యూ లైన్లలో ఉంచడం ధర్మమా..? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో చివరకు కోర్టులకే రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
2021-22 విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయకపోవడం శోచనీయం అని మండిపడ్డారు. ఈ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే ఆర్థిక సహాయం చేస్తామనడం ప్రభుత్వానికి సమంజసం కాదని విరుచుకుపడ్డారు. ఒక బిడ్డను బడికి పంపించి.. మిగతా బిడ్డలను బడి మానిపించమని చెప్పినట్టుందంటు సంచలన వ్యాఖ్యలు చేశారు తులసిరెడ్డి.