ప్రజలను నమ్మించి మోసగించడంలో ఏపీ సీఎం జగన్ సిద్ధ హస్తుడని విమర్శించారు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నారేళ్లలో నవ్యాంద్రప్రదేశ్ ని నేరాంద్రప్రదేశ్ ను చేశారని ఆరోపించారు. జగన్ పేరు వింటేనే విశ్వసనీయత అనే పదం వెనుదిరిగి పారిపోతోందని వ్యాఖ్యానించారు.
మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ దినచర్య అని అన్నారు. రైతులను, రైతు కూలీలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను, మద్యం విషయంలో మహిళలను, పెళ్లి కానుక పేరుతో రాష్ట్ర ఆడపడుచులను, అగ్రిగోల్డ్ బాధితులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఉద్యోగుల సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మరిచిపోయారని విరుచుకుపడ్డారు. సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నా వైసీపీ హామీలన్నింటినీ.. విస్మరించిందని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచి.. నమ్మిన ప్రజలను నట్టేట ముంచిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి.