మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలో నేలకొండ పల్లిలో కార్యక్తరలతో మాట్లాడుతూ.. పిడుగు ఎప్పుడైన పడవచ్చని, కార్యకర్తలంతా సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆయన అన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో కార్యకర్తలకు దగ్గరగా ఉండలేకపోయానని తెలిపారు. కానీ గతంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్నారు.
గతంలో తాను పూర్తిగా అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టిపెట్టానని పేర్కొన్నారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు. గత ఎన్నికల సమయంలో తాను రాష్ట్రం పర్యటించానని, ఇప్పుడు తన దృష్టంతా పాలేరుపైనే ఉందన్నారు. తనను మరోసారి ఆశీర్వదిస్తే మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానన్నారు.
గత ఎన్నికల్లో పాలేరు నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తుమ్మల పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఉపెందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉపేందర్ రెడ్డి వర్గం యాక్టివ్ అయింది.
ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తుమ్మల యాక్టివ్ అయ్యారు. పాలేరు నుంచి మరోసారి టీఆర్ఎస్ గుర్తుపై బరిలోకి దిగాలని భావిసున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పాలేరు టికెట్ ను టీఆర్ఎస్ ఈ ఇద్దరిలో ఎవరికి కేటాయిస్తుందో చూడాలి.