- ఆ నియోజకవర్గంలో ఓట్లాటకు నేతల సై..!
- గాదరి మరోసారి నెగ్గేనా..?
- ఈసారైనా దయాకర్ పై ప్రజలు దయ చూపుతారా..?
- లేదంటే ఉద్యమ చంద్రుడికి మద్దతిస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజురోజుకు ముదురుతోంది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో చేరికలపై దృష్టి సారించాయి. ముఖ్య నేతల పర్యటనలు, నేతల కామెంట్లు పరిశీలిస్తే ఎన్నికల ఫీవర్ దగ్గర్లోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది.
ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ నేతలు ఉవ్విళ్లూరుతుంటే.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సైతం ముఖ్యమంత్రి పీఠం కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. బూత్ స్థాయిలో తమ శ్రేణులను రాజకీయ రణక్షేత్రం వైపు సిద్ధం చేస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి రాజకీయ రగడ రాజుకుంది. అందులో ఒకటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం.
తుంగతుర్తి సీటును మరోసారి కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ పథకం రచిస్తుంటే.. ఇక్కడే తమ జెండా ఎగురవేయాలని బిజెపి, కాంగ్రెస్ నుంచి మొదలుకొని బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో పాటు వైఎస్సార్టీపీలు సైతం తహతహలాడుతున్నాయి. ఈ నియోజకవర్గం గతంలో జనరల్ కాగా.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంలో 2009లో ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. అనంతరం టీడీపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులు ఓ సారి గెలుపొందగా.. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి విద్యార్థి ఉద్యమ నేత గాదరి కిశోర్ రెండు పర్యాయాలు విజయం సాధించారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కిశోర్ చేతిలో అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎలాగైనా విజయం అందుకోవాలని అద్దంకి దయాకర్ ఆశపడుతున్నారు. అయితే.. కాంగ్రెస్ లోని వర్గ విభేదాలు ఆయనకు అడ్డంకిగా మారాయి. ఇంకా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలోని బీఎస్పీ సైతం ఇక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. దీంతో బీఎస్పీ శ్రేణులతో పాటు, స్వేరో సభ్యులు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్సార్టీపీ సైతం ఇప్పటికే ప్రముఖ గాయకుడు, కవి ఏపూరి సోమన్నను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీ సైతం ఇక్కడ గెలుపుపై ఆశలు పెట్టుకుంది.
కాగా.. ఇన్నాళ్లు ఇక్కడ సైలెంట్ గా ఉన్న బిజెపి ప్రస్తుతం వేగం పుంజుకుంది. అధికార పార్టీలో అసంతృప్తులను తమ గూటికి రప్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ పని చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారోజు చంద్రశేఖర్ బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని లెక్చరర్లందరినీ ఒక తాటిపైకి తెచ్చిన ఆయన.. వారందరినీ టీఆర్ఎస్, ఉద్యమంవైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తగిన గౌరవం దక్కలేదని ఇన్నాళ్లు ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిణామాలే ఆయన బీజేపీలో చేరడానికి కారణమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో లెక్చరర్లు, ఉద్యమకారులు, వివిధ ప్రముఖ సంఘాల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఉద్యమకారులు తమ వైపే నిలుస్తారనే భావనలో బిజెపి ఉంది.
మొత్తానికి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి, రాజకీయ పార్టీల కార్యాచరణ ముందే ముసురుకోవడంతో రాష్ట్రంలో ఈ నియోజకవర్గం వైపు ప్రజల దృష్టి మళ్లింది. మరి ఇక్కడి రాజకీయ పరిణామాలను ఏ పార్టీ అనుకూలంగా మలుచుకుంటుందో వేచిచూడాలి.