చైనా వాళ్ల దగ్గర తుపాకీ బలముంటే ….టిబెటిన్ల దగ్గర నిజం అనే బలముందని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. క్రిస్మస్ సందర్భంగా చైనా ప్రభుత్వానికి సందేశం ఇస్తూ ” చైనాలో ఈరోజు బౌద్దుల జనాభానే అత్యధికం..కానీ చైనా మాత్రం మా మతం చాలా సైంటిఫిక్ గా ఉందని నమ్ముతుంది…ఏది ఏమైనా మాది నిజమైన బలం… చైనా వాళ్లది తుపాకీ బలం…. దీర్ఘకాలంలో తుపాకీ బలం కంటే నిజం అనే బలమే శక్తివంతమైనది” అన్నారు.
మానవులంతా ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితం గడపాలని దలైలామా కోరారు. సానుభూతి, దయార్ధ హృదయం, సంఘజీవిగా ఉండడం వల్లనే అవి సాధ్యమని చెప్పారు. మెదడు ను ఉపయోగించి మన చుట్టూ ఉన్న భౌతిక వస్తువుల విలువను అంచనా వేసుకోవాలన్నారు. భౌతిక వస్తువులు తాత్కాలికమని..ఉదాహరణకు ఒక వ్యక్తి కోటీశ్వరుడైనంత మాత్రాన సంతోషంగా ఉండలేడని చెప్పారు. సంతోషమంటే మానసిక ప్రశాంతత. ఈ రోజు మతం పేరుతో ఒకరిని మరొకరు చంపుకుంటున్నారని.. ప్రతి మతం ప్రేమ అనే సందేశాన్నే ఇస్తుందని గుర్తించాలని దలైలామా చెప్పారు.