ప్రపంచాన్ని చైనా ప్రశాంతంగా బతకనిచ్చేలా లేదు. వ్యూహాన్‌లో పుట్టిన వైరస్ దెబ్బకు ఇప్పటికే అన్ని దేశాలు కకావికలమైపోతోంటే.. డ్రాగన్ కంట్రీ మరో పిడుగులాంటి వార్తను బయటపెట్టింది. చైనాలో ఇప్పుడు మరో ప్రమాదకరమైన వైరస్ కలకలం రేపుతోంది. సివియర్ ఫీవర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్ (SFTS ) అనే ఓ కొత్తరకం వైరస్ అక్కడ ప్రాణాలు తీస్తోంది.
SFTS కారణంగా కారణంగా ఇప్పటివరకు చైనాలో ఏడుగురు మృత్యువాతపడగా.. మరో 67మంది వైరస్‌బారిన పడి అనారోగ్యం పాలయ్యారు. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. నల్లిని పోలి ఉండే టిక్ అనే కీటకం నుంచి ఈ వైరస్ వ్యాపిస్తోందని భావిస్తున్న వైద్య నిపుణులు.. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఎస్ఎఫ్‌టీఎస్ బారినపడిన వారిలో జ్వరం, దగ్గు లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి.
ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు తూర్పు చైనాలోని జియంగ్సు ప్రావిన్స్‌లో 37 కేసులు వెలుగు చూడగా.. గత నెలలో ఒక్క అన్హూయ్ ప్రావిన్స్‌లోనే 23 కేసులు బయటపడినట్టు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ వైరస్ 2009 నుంచే చైనాలో ఉంది.. అయితే ఇటీవల మళ్లీ తిరగబెట్టడం ఆందోళన కలిగిస్తోంది.