తెలంగాణలో ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మరోసారి టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కింది కాబట్టి, ప్రత్యేక అనుమతి కింద రేట్లు పెంచుకోవచ్చంటూ కొన్ని ధరలు నిర్ణయించింది.
తాజా జీవో ప్రకారం తెలంగాణలోని మల్టీప్లెక్సులో టికెట్ ధరకు అదనంగా 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో అదనంగా 50 రూపాయలు పెంచుకునేలా అనుమతులిచ్చారు. అయితే ఇవి మొదటి 3 రోజులు మాత్రమే. ఆ తర్వాత వారం రోజులకు మల్టీప్లెక్సుల్లో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 30 రూపాయలు పెంచుకునేలా అనుమతులిచ్చారు. మొత్తంగా రిలీజ్ డేట్ నుంచి 10వ రోజు వరకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని, ఆ 10 రోజులు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది.
దీంతో తెలంగాణలో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మల్టీప్లెక్సుల్లో రీక్లెయినర్ సీట్స్ కావాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం 350 రూపాయలు పెట్టాల్సిందే. దీనికి జీఎస్టీ అదనం, బుక్ మై షోలో బుక్ చేసుకుంటే కన్వేయన్స్ ఛార్జీ అదనం. ఈ రెండూ కలుపుకుంటే.. టికెట్ ధర 400 రూపాయలకు అటుఇటుగా ఫిక్స్ అవుతుంది. ప్రస్తుతం సౌత్ లో అత్యథికంగా టికెట్ ధర కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోంది.
రెమ్యూనరేషన్లు, జీఎస్టీ కాకుండా.. 336 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా కోసం టికెట్ రేటుపై 75 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పటికే అనుమతినిచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఏకంగా వంద రూపాయలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చేసింది. ఈ నెల 25న థియేటర్లలోకి రాబోతోంది ఆర్ఆర్ఆర్ మూవీ.