సంక్రాంతి వచ్చిందంటే, కేవలం పెద్ద సినిమాల రాక మాత్రమే కాదు, టికెట్ రేట్ల పెంపు కూడా ఉంటుంది. ఓవైపు తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు, టికెట్ రేట్లు కూడా పెరుగుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి.
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపునకు స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. పెద్ద సినిమాకు 300 రూపాయల వరకు టికెట్ పెంచుకోవచ్చు. ఆ పద్ధతి ఏంటనేది అందరికీ తెలుసు. ఇక్కడంతా రెగ్యులర్ ప్రొసీడర్.
అయితే ఏపీలో మాత్రం టికెట్ రేట్ల పెంపు వ్యవహారం కాస్త కష్టంతో కూడుకొని ఉంది. ఏదైనా భారీ బడ్జెట్ సినిమాకు టికెట్ రేట్లు పెంచాలనుకుంటే, ప్రభుత్వంతో చిన్నపాటి చర్చలు జరపాల్సి ఉంటుంది.
ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 2 పెద్ద సినిమాలూ మైత్రీ మూవీ మేకర్స్ వే. అందుకే ఆ నిర్మాతలు ఇప్పుడు ఏపీ సర్కారును ఆశ్రయించారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు అడుగుతున్నారు. త్వరలోనే రేట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి వచ్చేలా ఉంది.