లక్నో నవాబ్ వాజీద్ అలీషా జూ పార్క్ కి మకుటం లేని మహారాజు టైగర్ కిషన్ కన్నుమూసింది. గంభీరమైన నడకతో,జూపార్క్ మొత్తంప్రతిధ్వనింపజేసే గాండ్రింపుతో కలియ తిరిగే కిషన్ గతకొంత కాలంగా క్యాన్సర్ తో పోరాటం చేసి చివరకు తుది శ్వాస విడిచింది.
ఈ రోజు ఉదయం జూ అధికారులు కిషన్ మృతి విషయాన్ని వెల్లడించారు. హెమాంజియోసర్కోమా అనే ఒక రకం క్యాన్సర్ బారినపడిన టైగర్ కిషన్.. రోజురోజుకు క్షీణించిపోయి చివరికి ప్రాణాలు విడిచింది.
టైగర్ కిషన్ మనుషులను వేటాడి తింటుండటంతో 2009లో కిషన్‌పూర్ టైగర్ రిజర్వ్ నుంచి తీసుకొచ్చి లక్నో జూలో వేశారు. 2008 నుంచి కొన్ని నెలలపాటు కిషన్ పలువురిని వేటాడి చంపింది.
ఆ పెద్దపులిని వేటాడటానికి అటవీ అధికారులు కొన్ని నెలలపాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2009లో బోనులో చిక్కడంతో లక్నో జూకు తరలించారు.అప్పటి నుంచి గత 13 ఏండ్లుగా కిషన్ లక్నో జూలోనే ఉంటున్నది.
కిషన్ చెవికి, మూతికి సమీపంలో క్యాన్సర్ ఏర్పడటంతో అది అడవి జంతువులను వేటాడే శక్తిని కోల్పోయిందని, అందుకే 2008లో అది జనావాసాల్లో చేరి మ్యాన్ ఈటర్‌గా మారిందని వైద్యాధికారులు తెలిపారు. 2009లో లక్నో జూకు తరలించినప్పటి నుంచి వైద్యచికిత్స అందిస్తూ సంరక్షిస్తుండటంతో 13 యేండ్లు మనగలిగిందని చెప్పారు.