మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ఖిలాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. కానీ అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిగతా సినిమాలపై రవితేజ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా’ వంటి చిత్రాలను వరుసగా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. వీటితో పాటు ‘టైగర్ నాగేశ్వరరావు’అనే పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
వంశీ దర్శకత్వంలో హీరో రవితేజగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైగర్ నాగేశ్వర రావు చిత్రం తెరకెక్కుతుంది. 1970 స్టువర్ట్‌పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్. నాలుగు నెలల ముందు ఈ చిత్రాన్ని టైటిల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12:06 నిమిషాలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అదే సమయంలో ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ , మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జివి.ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా సరికొత్తగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.