ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామ సమీపంలోని రిజర్వాయర్ వద్ద ఒక పులి హల్ చల్ చేసింది. బుధవారం తన మూడు పిల్లలతో ఒక పులి అటూ ఇటూ కదలాడుతూ కనిపించింది. వీటిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్లిన ఓ ట్రక్ డ్రైవర్ పులిని వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
పెంగంగా నది మీదుగా నిర్మాణంలో ఉన్న చనకా-కొరాట నీటి పారుదల ప్రాజెక్ట్ పంప్ హౌస్ సమీపంతో పాటు వ్యవసాయ పొలాల్లో, మండంలోని వివిధ ప్రాంతాల్లో పులి కనిపించిందని స్థానికులు టెన్షన్ కి గురవుతున్నారు. అయితే భీంపూర్ మండలంలోని తంసి కె, గొల్లఘాట్, నిప్పాని, గుంజల, పిప్పల్ కోట్, ధనోర, గుబిడి, కరంజితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన స్థానికులు, రైతులు పులితో పాటు దాని పిల్లలు కనిపించడం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో అటవీ శాఖ అధికారులు పగ్ మార్క్ లను నమోదు చేశారు. అంతేకాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దులోని యవత్మాల్ జిల్లాలోని తిపేశ్వర్ వన్యప్రాణలు అభయారణ్యంలో నివసిస్తున్న ఒక పులి దాని మూడు పిల్లలతో ఆదిలాబాద్ అటవీ శివారు ప్రాంతంలో సంచరిస్తోందని అధికారులు వెల్లడించారు.
అయితే వాటికి భద్రత కల్పించడంతో పాటు ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు యానిమల్ ట్రాక్టర్లు, 10 మంది బేస్ క్యాంప్ వాచర్లు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాటి కదలికలను ట్రాక్ చేయడానికి మోహరించారు. అలాగే ఈ ఆపరేషన్ లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ప్రభుత్వేతర సంస్థల వాలంటీర్లు కూడా భాగమయ్యారు.