జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరిస్తున్న వార్త కలకలం రేపుతోంది. శనివారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో మంచిర్యాల నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కమలాపూర్- బాంబుల గడ్డ సమీపంలోకి రాగానే పులి రోడ్డు దాటుతూ కన్పించిందంటున్నారు ప్రయాణికులు.
ఎదురుగా రావడంతో బస్సు డ్రైవర్ బస్సు ఆపాడు.. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ.. చూశామని చెప్పడమే కానీ.. ఎవరూ ఫోటోలు తీయలేకపోయారు.
జిల్లా వ్యాప్తంగా ఈ వార్త చక్కర్లు కొట్టడంతో రంగంలోకి దిగిన అధికారులు పులి జాడ కోసం ఆరా తీస్తున్నారు. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎటువైపు వెళ్తుంది..? ఎన్ని రోజులుగా జిల్లా అడవుల్లో సంచరిస్తుందనే విషయాలపై విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
పాదముద్రల ఆధారంగా బెబ్బులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ అనవాళ్ల ఆధారంగా పులిని పట్టుకునే ప్రయత్నాల్లో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.