దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి. దీనిలో ఇప్పటి వరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి.నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతోంది.
2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్‌లో 12 పులులు ఉండగా గతేడాది వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ ఉండగా, ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ కోర్ ఏరియా పరంగా ఏటీఆర్ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్, ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది.
సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి.