నిర్మల్ జిల్లాలో చిరుతల సంచారం కలకలంరేపుతోంది. సారంగాపూర్, దిలవార్పూర్, కుంటాల, లోకేశ్వరం మండలాల పరిధిలోని ప్రాంతాల్లో గతకొంతకాలంగా ఆవులు లేగదూడలు మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నాయి. కాగా.. సారంగపూర్ మండలం, బీరవెల్లి శివారు అటవీ ప్రాంతంలో తిష్ట వేసిన మూడు చిరుత పులులు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చిరుతలు నిత్యం పంటపొలాల్లో సంచరిస్తుండడంతో బావుల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. తరుచూ మేత కోసం వెళ్లిన పశువులపూ దాడులు చేయడంతో.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కాగా.. ఇటీవల ఓ లేగ దూడపై దాడి చేసిన పులులు దానిని చంపేశాయని చేప్తున్నారు.
తాజాగా.. కుంటాల మండలం మేదన్ పూర్ గ్రామంలో మరో లేగ దూడలపై దాడిచేసి హతమార్చింది చిరుత. ఈరెండు ఘటనలతో ప్రజలు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లే రైతులు తీవ్రభయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. పంట చేతికొచ్చిన దశలో అడవి జంతువుల బారినుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలాకు వెళ్తుంటారు. రాత్రిపూట చీకట్లో చిరుతపులులు ఏంచేస్తాయోనని భయంభయంగా గడపాల్సి వస్తోందంటున్నారు అక్కడి రైతులు.
కాగా.. చిరుతలు అటవీప్రాంతాల్లోనే సంచరిస్తాయని.. పంటచేలల్లోకి రావంటున్నారు ఫారెస్ట్ అధికారులు. పశువులపై దాడులు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని.. విచారణ జరిపి ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తామని అంటున్నారు. అంతేకానీ.. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో వాటికి ఎలాంటి హానికలిగించవద్దని అటవీశాఖ అధికారి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్ర శివారు ప్రాంతాలతోపాటు.. తెలంగాణలోని వివిధ గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తుంటాయని అధికారులు చెప్తున్నారు. అయితే.. ప్రజలు మాత్రం చిరుతపులుల సంచారంతో ఎప్పుడేం జరుగుతుందో అని భయంభయంగా గడుపుతున్నారు.