తెలంగాణలో ఎన్నికలకు ఇంకా అలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూ పోతుంది. ప్రధాన పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణంలో వేడిని పెంచుతున్నాయి. కీలక నేతలంతా విపక్షాలపై ఓవైపు దాడి చేస్తూనే స్వపక్షం లో సీట్లు సర్దుబాటుపై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానంపై చర్చ జరుగుతోంది. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో వనమా వెంకటేశ్వరరావుకు ఈసారి గులాబీ బాస్ టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆశావహుల కన్ను కొత్తగూడెం పై పడింది. ఆశావహులు అరడజకు పైగా ఉన్నప్పటికీ ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ముగ్గురు నేతలు ఇప్పటి నుంచే కేసీఆర్ మెప్పు పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గంలో ముగ్గురు తమ పాపులారిటీ పెంచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు బాస్ ని ప్రసన్నం చేస్తూనే స్థానికంగా పాత పరిచయాలను తిరగదోడుతున్నారు. సందర్భం లేకపోయినా.. అడపా దడపా ప్రజల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎవరి బలాబలాలు వారు బేరీజు వేసుకొని ముందుకు పోతున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈప్రాంతంలో టీడీపీ హయాంలోనే మంచి పట్టు ఉండేంది. దీంతో.. అధిష్టానం తమకే అవకాశం ఇస్తుందని తుమ్మల సన్నిహితుల దగ్గర కూడా చెబుతున్నారట. తుమ్మలతోనే భద్రాద్రి జిల్లా అభివృద్ధి సాధ్యం అంటూ ఆయన అభిమానులు సైతం సందడి చేస్తున్నారు.
ఇక జలగం వెంకటరావు విషయానికొస్తే.. తన తండ్రి జలగం వెంగళరావు కేంద్ర పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు చేసిన కృషి ఫలితంగానే కొత్తగూడెం పారిశ్రామికంగా అభివృద్ధి సాధ్యమైందని ఆయన ప్రచారం చేస్తున్నారని సమాచారం. ఈ విధంగా లోకల్ లో తన పాపులారిటీ పెంచుకొని తరువాత అధిష్టానం దృష్టి ఆకర్శించాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇదే సీటుపై మనుసు పారేసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది. బలమైన ఓటు బ్యాంక్ ఉన్న వారితో సత్సంబంధాలు కొనసాగించి.. తన పట్టుని సడలించాలని ఆయన చూస్తున్నట్టు తెలుస్తోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో లీడ్ తీసుకోవడం ద్వారా ట్రేడ్ యూనియన్లతోనూ ఉన్న సంబంధాలు పొంగులేటికి కలిసొచ్చే అంశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలా ఎవరి బలాలు వారు చెప్పుకుంటున్న.. కేసీఆర్ దృష్టి ఎవరిపై పడుతుందో చూడాలి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది స్థానాలకు గాను ఎస్టీలకు, రెండు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఇక మిగిలిన మూడు స్థానాల్లో పువ్వాడ అజయ్‌కుమార్, కందాళ ఉపేందర్‌రెడ్డికి రెండు స్థానాలు ఫిక్స్. మిగిలిన ఆ ఒక్క స్థానం ఈ ముగ్గరు నేతలను ఊరిస్తోంది. కేసీఆర్ ఒకరికి టికెట్ ఇచ్చి మిగిలిన ఇద్దరిని ఎలా ప్రసన్నం చేస్తారో చూడాలి.