ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఉంచిన సెల్ లో గ్యాంగ్ స్టర్లు లేరని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. సెంట్రల్ జైలు మొదటి బిల్డింగ్ లోని సెల్ లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఖైదీలు ఉన్నారని, వారు కూడా సత్ప్రవర్తన కలిగినవారని అధికారులు వివరించారు. సిసోడియా విపాసన సెల్ ప్రత్యేకంగా ఉంటుందని, ఆయనకు అక్కడ ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని వారన్నారు.
సిసోడియాకు జైల్లో ప్రాణహాని ఉందని, కరడు గట్టిన క్రిమినల్స్ ఉన్న సెల్ లో ఆయనను ఉంచారని ఆప్ నేతలు చేసిన ఆరోపణలను వారు కొట్టి పారేశారు. ముఖ్యంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ … తమ నేతను గ్యాంగ్ స్టర్లు హత్య చేయవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేశారు.
కోర్టు అనుమతించినప్పటికీ సిసోడియాకు విపాసన సెల్ ను కేటాయించేందుకు అధికారులు నిరాకరించారని వారు ఆరోపించారు. ఒకదశలో సంజయ్ సింగ్.. కేంద్రంపై విరుచుకపడ్డారు.
సిసోడియాను హతమార్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని, ప్రమాదకరమైన నేరస్తులున్న సెల్ లో ఆయనను ఉంచారంటే మరేమనుకోవాలని అన్నారు. అక్కడ ఆయనకు ప్రాణహాని ఉందని తాము ఆందోళన చెందుతున్నామన్నారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని, సిసోడియాకు పూర్తి భద్రత ఉందని జైలు అధికారులు పేర్కొన్నారు.