మనిషికి నిద్ర, ఆరోగ్యం రెండూ చాలా ముఖ్యం. జీవనశైలిలో మార్పులు, వివిధ రకాల ఒత్తిడి వల్ల చాలా మందికి సమయానుకూల నిద్ర దూరమైపోయింది. ఇప్పుడు ప్రతి పది మందిలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇదికాస్తా మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తోంది. నిద్రలేమికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన అని పలు అధ్యయనాల్లో తేలింది.
వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల్లో ఒత్తిడివల్ల మనస్సు 24 గంటలు చురుగ్గానే ఉంటున్నది. దీంతో నిద్ర కష్టతరమవుతోంది. అందుకే మీకు హాయిగా నిద్ర పట్టేందుకు అవసరమైన పలు చిట్కాలను మీ ముందుకు తీసుకొచ్చాం. అవి ఏంటో ఓ లుక్కేసేద్దాం.
1. పడుకునే ముందు గోరువెచ్చటి పాలను తాగినా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
2. రాత్రిపూట బెడ్‌రూం చీకటిగా ఉండాలి. లైట్ కళ్లపై పడితే నిద్ర పట్టదు. బెడ్‌రూంలో మందపాటి కర్టెన్లు వాడాలి.
3. రాత్రిపూట టీవీ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం మానుకోవాలని. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మెదడుపై ప్రభావాన్ని చూపుతాయి.
4. కాఫీ, టీ, సిగరెట్లు నిద్రకు అత్యంత శత్రువులు, నిద్రలేమితో బాధపడుతున్నవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి
5. అశ్వగంధ ఒక అద్భుతమైన ఆయుర్వేద పదార్థం. మానసిక ఒత్తిడిని తగ్గించి, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. రాత్రి పడుకునే అరగంట ముందు ఈ ఔషధాన్ని తీసుకుంటే చక్కగా నిద్రపోవచ్చు.
6. పడుకునే ముందుకు బాదం పాలు తాగడం వల్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది.
7. అరటి పండ్లు తినడం వల్ల సమయానికి నిద్ర బాగా పడుతుంది. ఇది మన శరీరంలో సెరోటోనిస్, మెలటోనిన్ ని పెంచి ఆరోగ్యమైన నిద్రకు దారి తీస్తుంది.
8. అలాగే గుమ్మడికాయ గింజలు కూడా నిద్ర పట్టడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వీటిలో జింక్, ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల మెదడు నిద్రను ప్రేరేపించడానికి సెరోటోనిన్ గా మారుస్తుంది.