కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితులు మంత్రోశ్చరణ నడుమ కన్నులపండువగా నిర్వహించారు.
తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముగింపు రోజు వేడుకలు కోలాహలంగా సాగాయి. విజయదశమి రోజు తిరుమల పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది.
తిరుమలలో శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో వేదమంత్రాలతో చక్రస్నాన నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఈరోజు ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున ఆరంభమై ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. తరువాత శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. టీటీడీ వేద పండితులు వేద పారాయణం చేశారు.
ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూసమేతమలయప్పమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శ వల్ల పవిత్రమైన పుష్కరిణీ జలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అయినట్టు భావిస్తారు.
గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గత ఏడాది 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈ ఏడాది గత ఎనిమిది రోజుల్లో 7.20 లక్షల మందికి స్వామివారి దర్శన భాగ్యం కలిగిందని ఆలయ ఈవో అనిల్‌కుమార్ సంఘాల్ చెప్పారు. సోమవారం ఒక్కరోజే లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 32 లక్షల లడ్డూలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.