తిరుమల పుణ్యక్షేత్రం రెండో ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం తృటిలో తప్పింది. కొండపైకి వెళ్తున్న బస్సు.. అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. కొండను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ వెళ్లింది. ఈ ఘటన లింకు రోడ్డుకు సమీపంలో చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో భక్తులకు ప్రాణాపాయం తప్పింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ప్రయాణికులకు వేరే బస్సు ద్వారా తిరుమలకు తరలించారు. బస్సును క్రేన్ల సహాయంతో ఆర్టీసీ ఉద్యోగులు బయటికి తీశారు.
కాగా కొద్ది రోజుల కిందటే ఆర్టీసీ బస్సు ఒకటి ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి, లోయలోకి జారి పడబోయింది. లోయ అంచుల్లో ఉన్న చెట్లకు చిక్కుకుని నిలిచిపోయింది. ఇలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్ మెంట్లు 14 నిండిపోయాయి. సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 65,633 మంది భక్తులు దర్శించుకోగా 23,352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.