తిరుమలకు భారీ స్థాయిలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వారం రోజులుగా తిరుమలలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే దసరా సెలవులు ముగిసినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి భక్తులు పోటేత్తుతున్నారు.
దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరిలోని 9 షెడ్లు ఫుల్ అయ్యాయి. దీంతో గోగర్భం డ్యాం దగ్గర నుంచి భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 40గంటల సమయం పడుతోంది.
టీటీడీ సిబ్బంది భక్తులకు అల్పహారం, మంచినీటిని అందిస్తున్నారు.నారాయణగిరి విశ్రాంతి భవనం వెనుక భాగంలోని రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సర్వదర్శన భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాలుగు రోజులుగా తిరుమలలో ఓ మోస్తరు వర్షం పడుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో చాలా మంది భక్తులు అఖిలాండం దగ్గర కొబ్బరి కాయలు కొట్టి.. శ్రీవారిని దర్శించుకోకుండానే తిరుగు ప్రయాణం అవుతున్నారు. మరోవైపు తమిళులు పవిత్రంగా భావించే పెరటాశి మాసం చివరి వారం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు