తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆనంద నిలయానికి చేరుకున్న సీయం జగన్ శ్రీవెంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తరువాత సీయం పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్నారు. దసరా సెలవులతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడంతో భక్తులు విపరీతంగా పెరిగారు. దారులన్నీ శ్రీవారి గుడికే దారితీస్తున్నాయి. కొండలరాయడి బ్రహ్మోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తకోటి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు.
తిరుమల : శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబయ్యింది. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి. మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై ఊరేగనున్న దృశ్యాన్ని కనులారా తిలకించేందుకు తిరుమల కొండకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిజానికి ఆదివారం జరిగిన అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమైనట్టే. ధ్వజారోహణంతో అసలు ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెబుతారు. ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖరరెడ్డి పలు మార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చరిత్రలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకుముందెప్పుడు జరగలేదు.