దేవీపట్నం మండలంలో గోదావరి లాంచీ మునక ప్రమాదంలో బయటపడినవారి మొహంలో ఆనందం ఏ కోశానా లేదు!
మేము ఎందుకు బ్రతికాము – అంటూ అందరిలో ఒకటే ప్రశ్న. విహార యాత్రకి కుటుంబం తో పాటు వెళ్ళినవాళ్ళు కొందరయితే, స్నేహితులతో వెళ్ళినవారు మరికొందరు. అయితే, తాము బ్రతికినా, వాళ్ళ వాళ్ళ ఆచూకీ దొరకక తీవ్ర విషాదంలో వున్నారు.
తిరుపతికి చెందిన మాధవీలత తన భర్త, కూతురితో కలిసి భద్రాచలం వెళ్తున్నారు. దాదాపు 60 మంది ప్రయాణికులు, 20 మంది సిబ్బంది తో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ఠ లో మాధవి కుటుంబం కూడా వుంది.
ఈ ప్రమాదంలో మాధవీలత ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆమె భర్త, కుమార్తె గల్లంతవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
”బిడ్డ లేకుండా నేనెలా బతకాలి.. భర్తను, బిడ్డను పోగొట్టుకుని వచ్చాను.. నేనేం పాపం చేశాను, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది”, అంటూ తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.