ఈ మధ్య కాలంలో జన సంచారంలోకి పులులు, చిరుతలు సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యం అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహా రాష్ట్ర సరిహద్దు గ్రామాలు, ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చిరుత, పులులు జనం మధ్యలోకి రావడంతో జనం గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇక వాటిని పట్టుకోవడం అటవీ శాఖ అధికారులకు పెద్ద సవాల్ గా మారుతోంది.
ఇక ఇలా ఉంటే.. కరోనా సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో..చిరుతలు, పులులు ఘాట్ రోడ్డెక్కడం అలవాటుగా మార్చుకున్నాయి. అప్పట నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు చిరుత, పులుల భయం వెంటాడుతోంది. నిత్యం తిరుమలలో ఎక్కడో ఒక చోట ఇవి కనిపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదే విధంగా భక్తుల కారణంగా వన్యప్రాణులు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది తిరుమలలో.
అయితే తాజాగా మరో సారి చిరుత సంచారం ఘాట్ రోడ్డులో కలకలం రేపుతోంది. తిరుమలలోని మొదటి కనుమ దారిలో రోడ్డులోని 35 వ మలుపు దగ్గర చిరుత సంచారం భక్తుల కంట పడింది. ఆ చిరుత నీటిని తాగడానికి వచ్చినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక్క సారిగా చిరుత ప్రత్యక్షం కావడంతో తిరుపతికి వెళ్తున్న వాహనదారులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అయితే చిరుత నీటిని తాగి అక్కడి నుంచి ఘాట్ రోడ్డు వైపు నడుస్తూ కనిపించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో వైపు అటవీ శాఖ అధికారులు చిరుతను తిరిగి అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే టూ వీలర్ పై ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే వాహనదారులు, భక్తులు ఇలా చిరుతలు, పులుల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.