ప్రపంచంలోనే అత్యంత సుందర ప్రదేశాల్లో తిరుమల తిరుపతి ఒకటి.ఏ కాలంలో చూసిన అక్కడ ప్రకృతి భక్తులను పలకరిస్తూనే ఉంటుంది. తన అందాలతో కనుల విందు చేస్తుంది. అక్కడ ఎక్కడ చూసిన పరిసరాలు మనతో ఊసులాడుతున్నట్లే ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక ప్రాంతం ఇప్పడు మరిన్ని సోయగాలను పులుముకుని భక్తుల మదిలో నిలుస్తోంది.
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల తిరుపతి మరింత సుందరంగా తయారయ్యింది. ప్రస్తుతం ఏడు కొండలపై వాతావరణాన్ని చూస్తే అందాల భూలోక స్వర్గం అనాల్సిందే.
సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే నడియాడిన దివ్యక్షేత్రం తిరుమల. ఇప్పుడు ఆ ప్రదేశమంతా కేవలం ఆధ్మాత్మికతనే కాకుండా… ఆహ్లాదకర వాతావరణంతో భక్తుల మనుసులను కట్టి పడేస్తుంది.
రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని పలకరించడంతో కొండకోనల్లో ఉన్న చెట్లన్నీ పచ్చగా మరింత అందంగా ఆహ్వానం పలుకుతున్నాయి. ఓ వైపు చిరు జల్లులు…మరోవైపు కొండలను తాకుతున్న తెల్లని మబ్బులు. ఇలా ఎక్కడ చూసిన అందాల సుందర దృశ్యాలు కనులవిందు చేస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా ఘూట్ రోడ్డులో ప్రయాణం.. అటు భక్తి భావంతో పాటు.. ఆనందాన్ని కూడా ఇస్తోంది. కనుల విందు చేస్తున్న ప్రకృతి సోయగాలతో హాయిహాయిగా సాగే ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నారు భక్తులు. భక్తులను మరింత ఆహ్లాదపరిచేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఉద్యానవనాన్ని ప్రత్యేకంగా తీర్చి దిద్దుతున్నారు.
ప్రస్తుతం తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. వర్షాలు పడుతున్నప్పటికీ స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యంలో వస్తూనే ఉన్నారు. ఎన్నో శ్రమలనోర్చూకుని అక్కడకు చేరుకున్న భక్తుల మనస్సు చాలా ప్రశాంతంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. స్వామివారి నామాలు… వివిధ ఆకృతులను తీర్చి దిద్ది స్వామి వారి దర్శనానికి క్యూలైన్ లో వెళ్లే భక్తులకు భక్తి భావాన్నిపెంపొందించేలా చేస్తున్నారు.
ఏడుకొండల్లో ఉండే అందాలు అణువణువు కూడా భక్తులను ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. పచ్చని చీర కట్టినట్లు అందాలు మరో లోకానికి తీసుకెళ్లేలా చేస్తున్నాయి.అయితే ప్రస్తుతం వాతావరణ కూడా మరింత చల్లగా ఉండడంతో.. ఆ అందాలు మరింత రెట్టింపు అవుతున్నాయి.
సాధారణంగా వేసవిలో సైతం తిరుమల కొండపై ఉంటే చల్లాగానే ఉంటుంది. అసలు ఎండ ప్రభావం తెలియదు.. ఇప్పుడు అక్కడి వాతావరణం మరింత కూల్ గా ఉంటుంది. ఇలాంటి సమయంలో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పచ్చని పార్కులు మరింత అందంగా ఓ సుందర దృశ్యంలా కనిపిస్తున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో ఎటు చూసినా ఏపుగా పెరిగిన వృక్ష సంపద ఆకట్టుకుంటుంది. వీటికి తోడు చుట్టూ చక్కటి జలపాతాలు.. పక్షుల కిలకిలారావాలు.. బెట్లుడుతల ఉయ్యాలాటలు.. దివ్య సుగంధాల పరిమళాలు.తిరుమల ఇప్పుడు ఆధ్యాత్మికంగానే కాదు పర్యటక ప్రాంతంగానూ ఆకట్టుకుంటోంది.