ఏపీలో తాజాగా ప్రకటించిన 16 కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను భయాందోళన కలిగించేలా ఉన్నాయి. ఇన్నాళ్లు విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారితోనే ఇబ్బంది అనుకుంటుండగా, ఇప్పుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి భయం పట్టుకుంది.
అయితే, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వైఫల్యంతో ఇతరులకు కూడా కరోనా వైరస్ సోకుతున్నట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో కొత్తగా నమోదైన కేసుల్లో ఓ మహిళకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. తన బంధువులు కూడా ఎవరూ ప్రయాణాలు చేయలేదు. కానీ ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానిక ప్రజలు, అధికారులు ఉలిక్కి పడ్డారు. అయితే… ఆ మహిళ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వస్తున్న ప్రయాణికుడితో ప్రయాణించిందని తెలుసుకొని షాక్ అవుతున్నారు. ఇది స్టేజీ-3కి దారి తీసే ప్రమాద ఘంటికలు అని అధికారులు కంగారు పడుతున్నారు.
తాజా ఘటనతో… తిరుపతిలోని 43,44,45,46 వార్డులతో పాటు ఆ చుట్టు పక్క 2 కి.మీ మేర రెడ్ జోన్ ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులను క్వారెంటైన్ కు తరలించారు.