టీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రాం నిప్పులు చెరిగారు. అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకే సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని ఆయన అన్నారు.
జహీరాబాద్ లో రైతు సమావేశానికి హాజరైన ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. న్యాల్కల్ మండలంలో నిమ్జ్ పేరిట చేపట్టిన ఈ బలవంతపు భూసేకరణలను వెంటనే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ.కోటి విలువైన ఈ భూములను రూ.10 లక్షలకే సేకరించడం అన్యాయమన్నారు. నిమ్జ్ ఏర్పాటు చట్ట విరుద్ధమని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీ నాయకుల భూదాహాన్ని తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అతి తక్కువ ధరకు కొట్టేసేందుకే ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. పరిశ్రమల పేరును అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నాయకులే భూములను కొట్టేస్తారని అన్నారు. అప్పుడెప్పుడో నిజాం కాలంలో ఇలాంటి పద్ధతి చూశామన్నారు.
ఇప్పుడు మళ్లీ ఆ విధానాన్ని చూస్తున్నామని కోదండరాం అన్నారు. దీనిపై తాము ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అనుమతులు లేవని, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను ప్రభుత్వం తీసుకోలేదన్నారు. దీనిపై తాము అన్ని రకాలుగా పోరాడుతామన్నారు.