కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చాలని, కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం బుధవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు దిగారు. ఉదయం 11 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయనున్నారు కోదండరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణా నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతామని హెచ్చరించారు. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలన్నారు.
కృష్ణా పరీవాహిక ప్రాంతంలో టీజేఎస్ యాత్ర నిర్వహించి వివిధ నిరసన కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా ఈ దీక్ష చేస్తున్నామన్నారు.
కోదండరాం నాయకత్వంలో టీజేఎస్ బృందం ఈ నెల 30, 31వ తేదీల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, కృష్ణా, గోదావరి బోర్డు అధికారులను కలుస్తామని స్పష్టం చేశారు కోదండరాం.