సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో సంభవించిన అగ్ని ప్రమాదం ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిదని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. శనివారం ఆయన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ ప్రమాదంతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిపుణులతో సర్వే చేయించి నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు.
అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు కోదండరామ్.