తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో ఎనిమిదేళ్ల విధ్వంసాన్ని.. అద్భుతమని చూపించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం రాసి ఇచ్చిందే గవర్నర్ చదివారన్నారు. గవర్నర్ కి ఇచ్చిన ప్రతిలో అన్ని అబద్ధాలు, తప్పులు ఉన్నాయని ఆరోపించారు.
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పురోగతి చెందిందని చెప్పడం బాధాకరమన్నారు. తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారని వాపోయారు. గవర్నర్ చెప్పినట్లు ప్రాజెక్టు పూర్తైతే 16లక్షల ఎకరాలకు సాగు నీరు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు.
ఫ్లోరైడ్ పీడ వదిలిందన్న గవర్నర్ మాటలు అవాస్తవమన్నారు. కృష్ణా జలాల్లో వాటా పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్న ఆయన.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.
గోదావరి, కృష్ణా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు ప్రజలకు మేలు చేయకపోగా.. కాంట్రాక్టర్లకు మాత్రం లబ్ధి చేకూర్చిందని దుయ్యబట్టారు.