ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఆత్మ గౌరవ దీక్షలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏం ఉద్ధరించారని.. దేశాన్ని ఎలుతానని బయలుదేరారో చెప్పాలన్నారు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండగా మారిందని విమర్శించారు.
ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు కోదండరాం. నిధుల ఖర్చు విషయంలో ఒక పద్ధతి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదని.. ఉద్యోగ నియామకాలు లేక వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గుర్తు చేశారు.
కాంట్రాక్టులన్నీ సీమాంధ్రులకే కట్టబెడుతూ, వారికి దోచి పెడుతున్నారన్న కోదండరాం.. అందుకే మరోసారి ఉద్యమ ఆకాంక్షల మేరకు ఆత్మగౌరవ దీక్ష చేపట్టినట్లు వివరించారు. ఉద్యమకారులంతా పోరాటం చేసి లక్ష్యాలను సాధిస్తామని స్పష్టం చేశారు. దీక్షకు ముందు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కోదండరాం. కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం ఈసడించుకుంటోందన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక మార్పు కోసం మేధావులు, సామాజిక ఉద్యమ శక్తులు, అన్ని రంగాల నిపుణులతో రాష్ట్ర సలహా కమిటీని వేస్తామన్న మాట నీటి మూటగానే మిగిలిందని గుర్తు చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి నిరంకుశ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ పై ఫైరయ్యారు. ప్రశ్నించిన వారిని అణిచి వేస్తూ పథకాల పేరుతో ప్రజా చైతన్యాన్ని నీరు గార్చే కుట్రలు చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు కోదండరాం.