పునరావాసం, నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా భూ నిర్వాసితులను ఖాళీ చేయడానికి వీల్లేదని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద గుడాటిపల్లి గ్రామ భూ నిర్వాసితులు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
అనుమతులు లేకుండా గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించొద్దని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ.. ప్రభుత్వం ఎన్జీటీ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు చేయించాలని చూస్తోందని ఆరోపించారు. పునరావాసం, నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా భూ నిర్వాసితులను ఖాళీ చేయించకూడదని నర్మదా కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు.
భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ప్రజలకు నష్టపరిహారంగా ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని అన్నారు. కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి భూ నిర్వాసితులను ఆదుకోవాలనే సోయి కూడా లేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వారిని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే.. దీన్ని జాతీయ స్థాయి సమస్యగా మార్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని.. అన్ని వర్గాలను కలుపుకొని పోతామని అన్నారు.