ప్రగతి భవన్ కు సామాన్యులు వెళ్లలేని పరిస్థితి. సమస్యలను సీఎంకు వివరించాలంటే అపాయింట్ మెంట్ దొరకని దుస్థితి. కేసీఆర్ కు సామాన్యులంటే ఎందుకంత చిన్నచూపు?. ఇలా అనేక ఆరోపణలు వస్తున్నా సీఎం తీరులో ఏమాత్రం మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.
ప్రగతి భవన్ ఎంట్రీ తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా గుత్తేదారులకే సునాయాసంగా ఉందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టేశారని విమర్శించారు. సచివాలయం లేకుండా రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కోదండరాం.
జూన్ 2న ఆత్మగౌరవ దీక్ష చేయడంతోపాటు ఉద్యమకారులను ఏకం చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణను తానే తెచ్చినట్టుగా కేసీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఏపీ గుత్తేదారులకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పాలకులకు దళారీగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడివారితో కుమ్మక్కు అయ్యారని.. కృష్ణా జలాల విషయంలోనూ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించలేదని విమర్శించారు.
కేసీఆర్ నిర్ణయంతో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కరవుతో తల్లడిల్లుతున్నారన్న కోదండరాం… తెలంగాణ ఆత్మగౌరవానికి ఆటంకం రాష్ట్ర ప్రభుత్వమే కలిగిస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీతనానికి పాల్పడుతున్న పాలకులకు వ్యతిరేకంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.