టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మరోసారి రియాక్ట్ అయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. TSPSC అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందంటూ మండిపడ్డారు. పాలకుల తీరుతో నిరుద్యోగులకు భవిష్యత్ మీద నమ్మకం పోయిందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ను బాధ్యునిగా చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లీకేజీ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలని కోరారు కోదండరామ్. అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలన్నారు. ఆంధ్రా నేతలు ఆటంకంగా నిలిచారని తరిమికొట్టిన తెలంగాణ బిడ్డలు.. తెలంగాణకు అడ్డంకిగా మారిన పాలకులను గద్దె దించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ నాది అన్నట్టుగా భవిష్యత్తును నలిపేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. నిరంకుశాన్ని కూలదోసినప్పుడే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని కోదండరామ్ తెలిపారు. తెలంగాణ బచావో పేరుతో ప్రజాస్వామ్య తెలంగాణకు పురుడు పోస్తామని పేర్కొన్నారు.
నీళ్ల పేరుతో కాళేశ్వరంలో కమీషన్లు, నిధుల కోసం భూదందాలు, నియామకాల పేరున లీకేజీల పేరుతో వ్యాపారం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండి పడ్డారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగర హారం లాంటివి చేపడితే.. అవన్నీ కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టిందంటూ విమర్శించారు కోదండరామ్.