జర్నలిస్ట్ రవి ప్రకాష్ అక్రమ అరెస్టుపై నిరసనలు
ఆందోళనకు సిద్ధం అవుతున్న తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం
టీజేఎస్‌ఎస్ నేతృత్వంలో కదులుతున్న జర్నలిస్టులు
హైదరాబాద్: ఫిర్యాదు చేయగానే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రవిప్రకాశ్‌ను అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యే అని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆరోపించింది. ఒకవేళ రవిప్రకాశ్ నిజంగా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం, అది కూడా శనివారం అరెస్టు చేయడం వేధించడమేనని సంఘం ప్రతినిధులు దుయ్యబట్టారు. శనివారం అరెస్టు చేయడం వలన బెయిల్‌కి అప్పీల్ చేసుకోడానికి ఎలాంటి వీలు లేకుండా చేశారని, ఇది పోలీసులు అధికారికంగా చట్టాలను దుర్వినియోగం చేయడమేనని అన్నారు.
తెలంగాణలో ప్రశ్నించే మీడియాను భయపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని టీేజేఎస్ఎస్ అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా భావించే వాళ్ళను అరెస్టులతో భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను హరించేలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని టీజేఎస్ఎస్ ప్రతినిధులు అంటున్నారు. జర్నలిస్టులపై ఇలాంటి వేధింపులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం హెచ్చరించింది.