అదానీ-హిండెన్ బెర్గ్ నివేదికపై సీనియర్ లాయర్ హరీష్ సాల్వే చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కొట్టిపారేశారు. అమెరికాలోని హిండెన్ బెర్గ్ సంస్థ అంత సహాయకారి కాదని, అది ఓ అవకాశవాది అని సాల్వే ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ తన నివేదికను విడుదల చేసిన తరువాత అదానీ గ్రూపు సంస్థల షేర్లన్నీ కోట్లాది డాలర్లమేర నష్టపోయాయని, అసలు ఆ రిపోర్టు లక్ష్యం మధ్యతరగతి ఇన్వెస్టర్ల దురదృష్టాన్ని అడ్డుపెట్టుకుని లాభాలను ఆర్జించడమేనని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ..మార్కెట్లో భారీ లాభాలు పొందినవారినందరిపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.. ఈ మాజీ సొలిసిటర్ జనరల్ లండన్ లో కూర్చుని అదానీ మీద ప్రేమ కురిపిస్తూ లెక్చర్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
‘నాగ్ పూర్ వకీల్ సాబ్ ! మీరు అదానీ నుంచి మీ ఫీజు వసూలు చేసుకోండి.. ఈ సారి ‘హంప్టీ డంప్టీని ఎవరూ కాపాడలేరు’ అని ఆమె సెటైర్ వేశారు. సాల్వే తన క్లయింటును సమర్థించేందుకు కోర్టులో వాదనలు వినిపించుకోవచ్చునని, ఎవరూ అభ్యంతరపెట్టరని అన్నారు.
న్యూస్ ఛానళ్లలో పెయిడ్ పీఆర్ వంటిది ఉండవచ్చునని పేర్కొన్న ఆమె..ఆయన తీరును ‘ఫేక్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వాయిస్’ గా అభివర్ణించారు. తన కసిని ఆమె ఇలా తీర్చుకున్నారు.