కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తాము సమాన దూరంగా ఉంటామని ప్రకటించుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఆశ్చర్యంగా విపక్షాలతో చేతులు కలిపింది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తన ఛాంబర్ లో నిర్వహించిన సమావేశానికి నల్ల దుస్తులతో ఈ పార్టీ నేతలు ప్రసూన్ బెనర్జీ, జవహర్ సర్కార్ హాజరయ్యారు. రాహుల్ గాంధీ అనర్హతపై విపక్షాలన్నీ సమైక్యంగా పోరాడాలని, ఇదే తమ వ్యూహంగా ఉండాలని ఈ మీటింగ్ లో నిర్ణయించారు.
ఇతర సమస్యలకు సంబంధించి జాయింట్ ఫ్రంట్ నుంచి తమకు తాము దూరంగా ఉన్నా.. ఈ విషయంలో మాత్రం అంతా ఒక్క తాటిపైకి రావాలని తీర్మానించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా తాము ఆహ్వానిస్తామని ఖర్గే ప్రకటించారు.
నల్ల దుస్తులు ధరించి నిరసన పాటించినవారిలో బీఆర్ఎస్, శివసేన (ఉద్ధవ్ వర్గం) సభ్యులు కూడా ఉన్నారు. ఖర్గే ఛాంబర్ లో జరిగిన సమావేశానికి 17 విపక్షాలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. డీఎంకే, సమాజ్ వాదీ, జేడీ-యు, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ, ఐయుఎంఎల్, ఆప్, వంటి ప్రతిపక్ష ఎంపీలు ఇందులో పాల్గొన్నారు.
ఇక ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వీరంతా నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘ఈడీ-మోదానీ భాయ్ భాయ్’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని గాంధీ విగ్రహం వరకు ప్రదర్శనగా సాగారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ కేకే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ సభ్యులంతా నినాదాలు చేశారు.