కోల్ కతా, తొలివెలుగు: బెంగాల్ విజయం తరువాత టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇటీవల ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది.కాంగ్రెస్ పై దూకుడు పెంచిన దీదీ.. కాంగ్రెస్ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని పరోక్షంగా చెప్తోంది.టీఎంసీ పార్టీ పత్రిక జాగో బంగ్లాలో పలు కీలక వార్తలను ప్రచురించింది. కాంగ్రెస్ యుద్ధంలో అలసిపోయిందని.. ఆ స్థానం టీఎంసీ తీసుకుంటుందని రాసుకొచ్చింది. పార్లమెంట్ లో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్.. అంతర్గత కుమ్ములాటల్లో తలమునకలై ఉందని ప్రస్తావించింది. దీంతో ప్రజల తరపున పోరాడే బాధ్యత తాము తీసుకుంటామని.. అసలైన కాంగ్రెస్ తమదేనని అభివర్ణించింది.
బెంగాల్ ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో కలిసి ప్రయాణించిన మమత బెంగాల్ విజయం తరువాత తన స్వరం మార్చింది.కాంగ్రెస్ తో కలిసి వెళ్లే కంటే..కాంగ్రెస్ స్థానంలో తానే ఉండాలని భావించినట్టు తెలుస్తుంది.దీంతో అవకాశం ఉన్న ప్రతీచోట టీఎంసీని విస్తరించాలని చూస్తోంది. కాంగ్రెస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్నవారితో టచ్ లోకి వెళ్లి టీఎంసీలోకి ఆహ్వానిస్తుంది.ఇప్పటికే గోవా, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఆపరేషన్ మొదలు పెట్టింది.