హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడానికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పన కోసం అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ లు, అండర్ పాస్ లు, స్కై వంతెనలతో నగర ప్రజలకు రవాణా సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నగర రవాణా మెరుగు పర్చేందుకు 5,555 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్ -1, 3,115 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్-2 పనులు కొనసాగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. మూసీపై 3 చెక్ డ్యామ్ లు, 14 వంతెనలు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఈ 14 వంతెనలు వైవిధ్యంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నామని చెప్పారు.
దాని కోసమే పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులను ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంతెనల నిర్మాణాలపై అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా మూసీ సుందరీకరణ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
మూసీ నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్ ను 100 శాతం మురుగుజలాలను శుద్ధి చేసే నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 36 ప్రాంతాల్లో 3,866 కోట్లతో ఎస్టీపీ లు నెలకొల్పబోతున్నామని వెల్లడించారు.