తనకు ఇష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలిసేందుకు ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణించాడో బాలుడు. మూడు రోజుల పాటు సైకిల్ పై ప్రయాణించి అష్ట కష్టాలు పడి చివరికి తన అభిమాన యూట్యూబర్ ఇంటికి వెళ్లాడు. కానీ చివరికి అతని నిరాశే ఎదురైంది.
వివరాల్లోకి వెళితే…. పంజాబ్ పాటియాలకు చెందిన బాలుడు(13) 8వ తరగతి చదువుతున్నాడు. యూట్యూబ్ లో ఆ బాలుడు ట్రిగ్గర్డ్ ఇన్ సాన్ అనే ఛానల్ ను ఫాలో అవుతున్నాడు. అందులో వచ్చే కామెడి అంటే ఆ బాలుడికి విపరీతమైన పిచ్చి.
ఈ క్రమంలో ఆ చానల్ నిర్వాహకుడు నిష్‌చాయ్ మల్హాన్‌ను ఆ బాలుడు కలవాలనుకున్నాడు. ఢిల్లీలోని పితంపుర అపార్ట్‌మెంట్‌లో మల్హాన్ ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. దీంతో ఈ నెల 4న తన సైకిల్‌పై ఢిల్లీకి ప్రయాణం మొదలు పెట్టాడు.
బాలుడు మూడు రోజుల పాటు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించాడు. చివరకు పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు బాలుడు చేరుకున్నాడు. కానీ ఆ సమయంలో మల్హాన్ ఇంట్లో లేడని, దుబాయ్ వెళ్లాడని మల్హాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాలుడు నిరాశకు గురయ్యాడు.
మరోవైపు తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలుడు ఢిల్లీ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలా బాలుడి ఆచూకీని కనుగొన్నారు. అనంతరం పితంపురలో బాలున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పాటియాలకు తీసుకు వచ్చిన అతని తల్లిదండ్రులకు అప్పగించారు.