కోటం రెడ్డి ఇష్యూ వైసీపీ కి పెద్ద తలనొప్పిగా మారుతోంది. మరోవైపు అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా,నిజాయితీగా తన అధికారాన్ని వదులుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటం రెడ్డి వెల్లడించారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని..కానీ తాను అలా చేయలేదన్నారు.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కోటం రెడ్డి చేసిన ఆరోపణలపై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటం రెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసని వ్యాఖ్యలు చేశారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్ళుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవాడినన్నారు. నా మనసు విరిగిందని..ప్రాణాతిప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చానన్నారు.
ఆఖరి దాకా ఉండి మోసం చేయలేదన్నారు.నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారం దొరికాక దూరం జరిగానన్నారు. దాదాపు 10 మంది మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసని కోటం రెడ్డి చెప్పారు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే నా వద్ద ఉన్న ఆధారం బయటపెట్టానని,ట్యాపింగ్ పై విచారణ జరపండి అని కోరానని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేదన్నారు.
ప్రజలు ఆమోదించేవారన్నారు ఆయన. అధికార పార్టీ ఎమ్మెల్యే పై ఫోన్ ట్యాపింగ్ ఆషామాఫీగా జరగదన్నారు. కోటం రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమని లీకులు ఇస్తున్నారన్నారు కోటం రెడ్డి. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసి.. శాశ్వతంగా జైల్లో పెట్టండన్నారు ఆయన. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప…నా గొంతు ఆగే ప్రశ్నే లేదన్నారు. నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం, ఎన్ కౌంటర్ చేయించండని కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందన్నారు.