క్రికెట్ లో పసికూనగా అడుగులేస్తున్న టీంగా అఫ్ఘనిస్తాన్ ను చేప్పుకుంటారు. కానీ.. ఆ పసి కూనే ఇప్పుడు సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్ లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్ లో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని అఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తక్కువ స్కోర్ బోర్డ్ ను అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కాపాడుకోగలిగారు. 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. బౌలర్ల తాకిడికీ తట్టుకోలేక 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో పసికూన పెద్దదైంది అంటూ క్రికెట్ అభిమానుల నుండి కామెంట్లు వినిపిస్తున్నాయి.
టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్ఘనిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాట్స్ మెన్ అల్లానూర్ (25), అబ్దుల్ హాదీ (37), నూర్ అహ్మద్ (30) మాత్రమే రాణించారు. శ్రీలంక బౌలర్లలో వినుజా రాంపాల్ 5 వికెట్లు సాధించాడు. అయితే.. శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యం నిలవడంతో అందరూ ఆ జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని భావించారు.
కానీ.. అనూహ్య రీతిలో ఆప్ఘనిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది. శ్రీలంక జట్టులో కెప్టెన్ దునిత్ (34) మాత్రమే రాణించడంతో ఆ జట్టు ఓటమి పాలయ్యింది. మొత్తం నలుగురు రనౌట్ అయ్యారు. కాగా.. ఫిబ్రవరి 1న సెమీస్ లో ఇంగ్లండ్ తో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది.